ఇదీ మరో మార్గదర్శిలానే..
- చిట్ ఫండ్ పేరుతోనో..మరొకలా ప్రజల సొమ్ముతో మోసాలు చేస్తామంటే ఎలా?
- దేశంలో, రాష్ట్రంలో ఎన్ని చిట్ ఫండ్స్ కంపెనీలు బోర్డులు తిప్పేశాయి..ప్రజలకు టోపీలు పెట్టేశాయి..
- చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం నిర్వహిస్తే తప్పులేదు..ప్రజల సొమ్మును వేరే విధంగా ఉపయోగించడమే పెద్ద తప్పు
- మోసాలు చేయడం.. రాజకీయాన్ని అడ్డు పెట్టుకోవడం..వారి నైజాం
- కక్ష సాధింపు చర్యలు కాదు..మహానాడును అడ్డుకోవడం కాదు..ఇవన్నీ లేనిపోని ఆరోపణలు
- నిబంధనలకు విరుద్ధంగా తప్పు ఎవరు చేసినా తప్పే
- రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్
ప్రజాభూమి,రాజమహంద్రవరం
రాజమండ్రిలో జగజ్జనని చిట్ ఫండ్ కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడం, పాటదారులను ఇబ్బందులు పెట్టడం వల్లనే..ఫిర్యాదులు అందుకున్న సీఐడీ అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారని..దీనిలో రాజకీయ కోణం, కక్షపూరిత చర్యలు గానీ ఏమున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు. మంగళవారం ఉదయం నగరంలోని వీఎల్ పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ భరత్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాస్ చంద్రబోస్ మాట్లాడారు. రాజమండ్రి నగరంలో జగజ్జననీ చిట్ ఫండ్స్ నిర్వాహకులుగా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ అరెస్టు వెనుక రాజకీయ కక్ష సాధింపు చర్యలే కారణమని, రాష్ట్ర ప్రభుత్వం కావాలనే అరెస్టు చేయించిందని..ప్రతిపక్ష నేతలు అధికార వైసీపీపైనా, సీఎం జగన్ పైనా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారని ఎంపీ భరత్ అన్నారు. నిజానికి సీఐడీకి జగజ్జనని చిట్ ఫండ్ బాధితుల ఫిర్యాదు మేరకే ఈ విచారణ, లోపాలు, అవకతవకలు ఉన్నాయి కాబట్టే ఆ కంపెనీ నిర్వాహకులను అరెస్టు చేసిందన్నారు. చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం సభ్యుల సొమ్మును నేషనల్ బ్యాంక్ లో మాత్రమే జమ చేయాలని, ఆ సొమ్మును కంపెనీ నిర్వాహకులు వారి సొంత ఆస్తులు కూడ బెట్టుకోవడానికో, మరొక కంపెనీలో షేర్లు, విలాసాలకు ఖర్చు చేయడానికి వీల్లేదన్నారు. కానీ ఇక్కడ చిట్ ఫండ్ యాక్ట్ నిబంధనలను తుంగలోకి తొక్కేసి..మేము రాజకీయ నాయకులం..ఏదైనా చెల్లుతుందనే అహంకారంతో ఇష్టం వచ్చినట్లు ప్రజల సొమ్మును వినియోగిస్తున్నట్టు సీఐడీ విచారణలో వెల్లడి కావడం వల్లనే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలను సీఐడీ తీసుకుంటోందని ఎంపీ భరత్ వివరించారు. దేశంలో శారదా చిట్స్ వ్యవహారం పార్లమెంటును ఎలా కుదేపిసిందో అందరికీ తెలుసన్నారు. అలాగే సహారా, సత్యం, అగ్రిగోల్డ్, కాల్ మనీ, మార్గదర్శి, జయలక్ష్మి..ఇలా ఎన్నో ప్రజల సొమ్ము వందల వేల కోట్ల రూపాయలు దోచుకుని బోర్డు తప్పేసి, ప్రజల నెత్తిన టోపీ పెట్టిన ఉదంతాలు చూస్తూనే ఉన్నామన్నారు. మళ్ళా బాధితులు ప్రభుత్వాన్నే ఆశ్రయిస్తాయని..వారికి న్యాయం చేయాల్సింది ప్రభుత్వమేనని అన్నారు. అందుకే ప్రజల సొమ్ముతో ఆస్తులు కూడబెట్టుకుని, పాటదారులను నెలలు, సంవత్సరాల తరబడి సొమ్ముల కోసం తిప్పించుకునే వారిపై ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తుందని చెప్పారు.
జగజ్జనని..జగజ్జంత్రీ
రాజమండ్రి నగరంలో జగజ్జననీ చిట్ ఫండ్ మహా జగజ్జంత్రీ అని..అనేక లుకలుకలు ఉన్నాయని సీఐడీ విచారణలో స్పష్టమైందని ఎంపీ భరత్ తెలిపారు. 477 ఏ డాక్యుమెంట్స్ ఫోర్జరీ, 409 మిస్సాఫ్ ప్రాపర్టీస్.. ఇలా అనేకం ఉండబట్టే చిట్ ఫండ్ సెక్షన్ 5 ప్రకారం ఆ కంపెనీ నిర్వాహకులను అరెస్టు చేసినట్టు ఎంపీ భరత్ తెలిపారు. చిట్ ఫండ్ చేస్తూ వేరే ఇతర వ్యాపారాలు చేయడానికి వీల్లేదని, కానీ ప్రజలు చిట్ ఫండ్ లో దాచుకున్న కోట్లాది రూపాయలతో ట్రాన్సేక్షన్స్ చేసినట్టు సీఐడీ విచారణలో రికార్డుల ద్వారా వెల్లడైందన్నారు. చిట్ ఫండ్ కంపెనీలు నిబంధనలు ప్రకారం నిర్వహిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. కానీ ప్రజలు కట్టిన సొమ్ము తీసుకువెళ్ళి ఆస్తులు కొనడం, మరొక వ్యాపారంలో పెట్టడం, వ్యక్తిగతానికి వినియోగించుకోవడం చట్ట రీత్యా నేరమని అన్నారు. చిట్ ఫండ్ కంపెనీలో చందాదారులు పాడుకున్న వారికి నెల రోజుల్లో డబ్బులివ్వాలని, కానీ నెలల తరబడి తిప్పించుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో వ్యాపారం చేసుకుంటూ..అడిగే వారిపై రాజకీయ జులుం ప్రదర్శించడం వల్లనే జగజ్జననీ నిర్వాహకులను అరెస్టు చేశారన్నారు.
పిచుకపై బ్రహ్మాస్త్రం.. దేనికీ
జగజ్జననీ నిర్వహకులు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులను అరెస్టు చేశారే కానీ..టీడీపీ నేతలుగా మాత్రం కాదని ఎంపీ భరత్ స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్ష నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు లేనిపోని విమర్శలు చేయడం శోచనీయం అన్నారు. కక్ష సాధింపు చర్యలని, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేయనందుకే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పూనుకుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని తదితరులు ఆరోపించడం సిగ్గుచేటన్నారు. పిచుకపై బ్రహ్మాస్త్రం దేనికని ఎంపీ భరత్ ప్రశ్నించారు. ఇష్యూని డైవర్ట్ చేయడానికి తప్పిస్తే మరొకటి కాదన్నారు. మహానాడును అడ్డుకునేందుకే టీడీపీ నేతలను ఇలా అరెస్టులు చేస్తోందని అంటున్నారని..ఇవన్నీ సీఎం జగన్ పైనా, రాష్ట్ర ప్రభుత్వం పైనా ఆరోపణలు చేయడం తగదన్నారు. నిజంగా మీ తప్పులు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై కేసులు వేయండన్నారు.
ప్రజలను మోసం చేసే కంపెనీలపై ఉక్కుపాదం మోపుతాం
సామాన్యులను వివిధ రకాలుగా ఆకర్షించి, మోసం చేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ సహించదని..ఉక్కుపాదం మోపుతామని ఎంపీ భరత్ హెచ్చరించారు. అవకతవకలు ఉన్నాయి కాబట్టే ఆదిరెడ్డి అండ్ కో యాంటిస్ బేటరీ బెయిల్ తెచ్చుకున్నారని..అదుంటే ఎన్ని తప్పులు చేసినా ఫర్వాలేదనుకుంటే ఇంక చట్టాలు, కోర్టులు ఎందుకని ఎంపీ భరత్ ప్రశ్నించారు. తప్పు చేస్తున్నారు కాబట్టే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని..అయితే చట్టం ముందు ఎవరైనా ఒకటే అన్నారు. ఇప్పటికైనా ప్రజలు మీ సొమ్మును జాతీయ బ్యాంకులలో పొదుపు చేసుకోవాలే తప్పిస్తే ఇలా బోర్డులు తిప్పే చోట దాచుకుంటే నష్టపోయాక గుండెలు బాదుకుంటే లాభం లేదని ఎంపీ భరత్ హితవు పలికారు. ఈ సమావేశంలో నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, నక్కా నగేష్, పాలిక శ్రీనివాస్, మార్తి లక్ష్మి, మజ్జి అప్పారావు, కడలి వెంకటేశ్వర రావు, బెజావాడ రాజ కుమార్, రేలంగి సత్యనారాయణ, దుంగ సురేష్,కలే చిన్ని తదితరులు పాల్గొన్నారు.