హిందూపురంటౌన్ :వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి కంచుకోటగా ఉన్న హిందూపురం నియోజక వర్గంలో కంచుకోటను బద్దలు కొట్టి వైసిపి జెండాను ఎగురవేస్తామని వైసిపి శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు నవీన్ నిశ్చల్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పట్టణంలోని వైసిపి కార్యాలయంలో ఎంపి అభ్యర్థి శాంతమ్మ, ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక, వేణుగోపాల్ రెడ్డి, మధుమతి రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసిపి జిల్లా అధ్యక్షులుగా ఎంపికై నవీన్ నిశ్చల్ ను వారందరూ అభినందించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో వైసిపి కుటుంబ సభ్యులందరూ ఏకమై టిడిపి కంచుకోటను బద్దలుకొట్టి వైసీపీ జెండా ఎగురవేసి, ఎంపిగా శాంతమ్మ, ఎమ్మెల్యేగా దీపికలను గెలిపించి ముఖ్యమంత్రి జగనన్నకు బహుమతిగా ఇస్తాం అన్నారు. దీంతో పాటు విజయ అవకాశాలపై పలు విషయాలు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా టిడిపి గెలుపుకు వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలు కారణం తప్ప వారి బలం ఏమాత్రం కాదన్నారు. నియోజక వర్గంలో 252 పోలింగ్ బూత్ లు ఉంటే బూత్ కు 10 నుంచి 20 ఓట్లు మాత్రమే వారు ఎక్కువగా సాధించారన్నారు. అంటే కేవలం 10 శాతం ఓట్ల ఆధిక్ష్యం మాత్రమే అన్నారు. వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి సమిష్టిగా పని చేసి, బూత్ కు 10 ఓట్లు వచ్చే విధంగా పని చేస్తే 40 సంవత్సరాల చరిత్రను తిరిగి రాయడానికి అవకాశం ఉందన్నారు. అదే విధానంలో అందరం పని చేస్తాం అన్నారు. 40 సంవత్సరాల టిడిపి పాలనలో శాశ్వతంగా టిడిపి వారు నియోజక వర్గానికి ఏమి చేశారన్నారని ప్రశ్నించారు. నియోజక వర్గం కోసం నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేశారన్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని, జగన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలతో తమ అభ్యర్థుల విజయానికి సోపానాలన్నారు. దీంతో పాటు గత టిడిపి ప్రభుత్వంలో నారాచంద్రబాబు నాయుడు ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. అదే వైసిపి ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ఎంతో అభివృద్ధి చేశారన్నారు. టిడిపి మోసాలు ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు ప్రజలను ఏ విధంగా నష్టాలకు గురి చేశారన్న విషయాలు ప్రజలకు అర్ధమయ్యే విధంగా వివరిస్తాం అన్నారు. అదే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అమలపరిచిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు వివరి స్తూ తమ ప్రచారం చేస్తాం అన్నారు. హిందూపురంతో పాటు జిల్లా అన్ని అని నియోజక వర్గాలతో పాటు హిందూపురం పార్లమెంట్ స్థానంలో సైతం వైసిపి జెండా రెపరెప లాడే విధంగా కృషి చేస్తామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారికి సంక్షేమ పధకాల్లో ఏ విధంగా న్యాయం చేశారో. అదే విధంగా జరగబోవు ఎన్నికల్లో అన్ని వర్గాల వారికి సమ న్యాయం చేశారని, ప్రధానంగా మహిళలకు పెద్దపీట వేశారని వైసిపి అసెంబ్లీ అభ్యర్థి దీపిక, పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మలు పేర్కొన్నారు. బీసీ వర్గానికి చెందిన కురువ దీపిక అనే నాకు అసెంబ్లీ అభ్యర్థిగా, బోయ శాంతమ్మ అనే నాకు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి వారు విడివిడిగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ ప్రజా ప్రతినిధులు పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.