కడప అసెంబ్లీ ఇంఛార్జి ఆర్. మాధవి రెడ్ది
కడప అర్బన్
రాష్ట్ర వ్యాప్తంగా 50,892 ఖాళీలుంటే, 6,100 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగుల్ని వంచించడమేనని తెలుగుదేశం పార్టీ కడప అసెంబ్లీ ఇంఛార్జి ఆర్. మాధవిరెడ్డి విమర్శించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ పేరుతో ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొనే జగన్ రెడ్డి కొత్త డ్రామాకు తెర తీశారు. నిరుద్యోగుల్ని మరోసారి వంచించడానికి సీఎం జగన్ సిద్ధమయ్యాడని ఆమె ఆరోపించారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నాలుగన్నరేళ్లు జగన్ చేసింది ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 50,892 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను గుర్తించింది. ఇప్పుడు జగన్ రెడ్డి కేవలం 6,100 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని మాధవి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా చేసిన ఏటా మెగా డీఎస్సీ.. జాబ్ క్యాలెండర్.. 2.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఏమయ్యాయో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ నిర్వాకంతో దేశవ్యాప్తంగా 11శాతం నిరుద్యోగం ఉంటే… ఏపీలో 24శాతం ఉంది. యువతను వంచించి రాష్ట్రాన్ని నిరుద్యోగాంధ్రప్రదేశ్ గా జగన్ మోహన్ రెడ్డి మార్చారని ఆమె విమర్శించారు.