బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటి, శృంగార తార, మోడల్ పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార)తో మరణించిందన్న వార్త హల్‌చల్ సృష్టించింది. పూనమ్ పాండే శుక్రవారం (ఫిబ్రవరి 2) ఉదయం సర్వైకల్ క్యాన్సర్‌తో మృతి చెందినట్లు ఆమె మేనేజర్ పరుల్ చావ్లా ఏఎన్ఐ న్యూస్ ఎజెన్సీకి మొదటగా తెలిపాడు. దాని తర్వాత కాసేపటికే పూనమ్ పాండే అధికారిక ఇన్ స్టా గ్రామ్ అకౌంట్‌లో ఆమె చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు.
దాంతో బాలీవుడ్ సెలబ్రిటీలంతా నిర్ఘాంతపోయారు. ఆమె మరణవార్తపై నివాళులు తెలుపుతూ కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారు. సోషల్ మీడియాలో రిప్ పూనమ్ పాండే పేరుతో ట్రెండింగ్ కూడా అయింది. మరోవైపు ఎంతో ఫిట్‌గా చలాకీగా ఉండే పూనమ్ పాండే ఆకస్మికంగా చనిపోవడం ఏంటీ అంటూ పలువురు నెటిజన్స్ క్వశ్చన్ చేస్తూ ఆరా తీశారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అయిండొచ్చు అని కామెంట్స్ సైతం చేశారు.
అయితే తాజాగా తాను బతికే ఉన్నట్లు వీడియో విడుదల చేసింది పూనమ్ పాండే. అందులో అలా తాను ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా తెలిపింది. “నేను మీ అందరితో ఒకటి చెప్పేందుకు ఇలా వీడియో చేస్తున్నాను. నేను బతికే ఉన్నాను. నేను సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించలేదు. కానీ, ఎన్నో వేల మంది అమ్మాయిలు ఈ క్యాన్సర్‌తో చనిపోయారు. సర్వైకల్ క్యాన్సర్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక అంతమంది అమ్మాయిలు చనిపోవడం చాలా బాధాకరం” అని పూనమ్ పాండే తెలిపింది.