బుట్టాయగూడెం:మనిషిని మనిషి దోపిడీ చేసే వ్యవస్థ పోవాలని, ఒక దేశం మరొక దేశాన్ని ,దోపిడీ చేసే వ్యవస్థ పోవాలని స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలను అర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల ఆశయ స్ఫూర్తికి అనుగుణంగా నీటి ఒక నడుచుకోవాలని ప్రగతిశీల యువజన సంఘం పిలుపునిచ్చింది. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల 93వ వర్ధంతిసభ మండలంలోని దొరమామిడి సిపిఐ (ఎంఎల్) కార్యాలయంలో పి వై ఎల్ డివిజన్ అధ్యక్షుడు కెచ్చెల పోతిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో ప్రగతిశీల యువజన సంఘం .పి వై ఎల్. డివిజన్ అధ్యక్షుడు కెచ్చెల పోతురెడ్డి. డివిజన్ సహాయ కార్యదర్శి తగరం బాబురావులు మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం పది సంవత్సరాల క్రితం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించి, నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని, ఆ ప్రకారం గత10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ బిజెపి ప్రభుత్వం ఈ దేశంలో నిరుద్యోగులను తీవ్రమైన మోసం , అన్యాయం చేశారని అన్నారు. దేశంలో మతోన్మాద ఫాసిస్టు విధానాలు అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కుల గణన పేరుతో పౌరసత్వం అమలు కోసం ప్రయత్నిస్తూ ఈ దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలపై తీవ్రమైన దాడి ప్రారంభించారని తెలిపారు . తమకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రజాస్వామిక వాదులను తప్పుడు కేసులు బనాయించి సంవత్సరాల కొలది జైలలో నిర్బంధిస్తున్నారని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మతోన్మాద ఫాసిస్టు విధానాలను అమలు చేస్తున్న బిజెపి మరియు మద్దతు తెలియజేస్తున్న పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగే పోరాటాలలో కలిసివచ్చే ప్రగతిశీల అభ్యర్థులను ఈ ఎన్నికలలో గెలిపించాలని కోరారు. ఈ వ్యవసాయక దేశంలో రైతుల పరిస్థితి అధ్వాన్న స్థితిలో ఉందని, పంటలకు గిట్టుబాటు ధరలు లేక నానా అవస్థలు పడుతున్నారని అన్నారు . కేంద్ర ప్రభుత్వం పంటల మద్దతు ధరలు చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించిన 44 కార్మిక చట్టాలను యధాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవుల 93 వ వర్ధంతి సందర్భంగా వారి ఉద్యమ స్ఫూర్తితో ఈ దేశంలో సామ్రాజ్యవాద కార్పొరేట్ శక్తులకు, పాసిజానికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు .ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం నాయకులు పూనెం రాముడు, మామిడి మురళి, కరకాల ప్రతాప్, గురుగుంట్ల బాబురావు ,గోగుల చిన్నారెడ్డి, గోగుల పండు తదితరులు పాల్గొన్నారు.