ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కాస్తా మోచా తుపానుగా మారింది. మొదటగా ఈ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలపై ఉంటుందని అధికారులు భావించారు.కానీ తుపానుగా మారిన అనంతరం తన దిశ మార్చుకుని ఈశాన్య రాష్ట్రాల వైపు దూసుకొస్తోంది. అయితే ప్రస్తుతం ఈ తుపాను మే 14న బంగ్లాదేశ్, మయాన్మార్ సరిహద్దుల్లోని తీరం దాటనుంది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. ఈ మోచా తుపాను గంటకు 220 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మోచా తుపాను మయాన్మార్ రఖైన్ తీరంలోని సిట్వే మధ్య ఆదివారం ఉదయం బలహీనపడుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో అక్కడి ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.అయితే తీర ప్రాంతంలోని నివసిస్తున్న దాదాపు అయిదు లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. గత రెండు దశాబ్దాల కాలంలో బంగ్లాదేశ్ చూసిన అతి భయంకర తుపానుల్లో సైక్లోన్ మోచా ఒకటవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆదివారం నాటికి ఈ తుపాను బంగ్లాదేశ్ – మయన్మార్ సరిహద్దు దిశగా కదులుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే కాక్స్ బాజార్ సముద్ర నౌకాశ్రయం వద్ద పదో నంబరు హెచ్చరిక జారీచేయడంతో తరలింపు ప్రక్రియను ముమ్మరం చేశారు.