అమరావతి:కాసేపట్లో రాష్ట్ర అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాదాపు రూ.3 లక్షల కోట్ల మేర ఉండబోతున్న ఈ బడ్జెట్లో తొలి మూడు నెలల కేటాయింపులకు బుగ్గన ఆమోదం కోరబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్ధిక మంత్రి బుగ్గన ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బడ్జెట్ ప్రాధాన్యతలను ఆయన వెల్లడించారు. ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్ కాపీలకు ఆర్ధిక మంత్రి బుగ్గన అమరావతి సచివాలయంలోని తన ఛాంబర్ లో పూజలు నిర్వహించారు. విజయవాడ దుర్గ గుడి నుంచి వచ్చిన అర్చకులు ఈ పూజలు చేశారు. అనంతరం బడ్జెట్ ప్రాధాన్యతలపై ఆర్ధికమంత్రి బుగ్గన సంక్షిప్తంగా వ్యాఖ్యలు చేశారు. బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ ఉంటుందని మీడియాతో ఆయన వెల్లడించారు. చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథలా భావించి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని బుగ్గన తెలిపారు. ప్రభుత్వం లేకపోతే బతకడం కష్టంగా ఉన్న నిస్సహాయ పేద వర్గాలే తమ ప్రాధాన్యత అని బుగ్గన పేర్కొన్నారు.గత ఐదేళ్ల బడ్జెట్ లో విద్య, వైద్యం, మహిళా సాధికారత, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసినట్లు బుగ్గన వెల్లడించారు. ఈసారి కూడా ఇవే ప్రాధాన్యతలు ఉంటాయని ఆయన సంకేతం ఇచ్చారు.