Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుబాల‌ల హక్కుల పరిరక్షణపై పోస్ట‌ర్ ఆవిష్కరణ

బాల‌ల హక్కుల పరిరక్షణపై పోస్ట‌ర్ ఆవిష్కరణ

ప్రజాభూమి విజయవాడ బ్యూరో
బాల‌ల హ‌క్కుల‌ను ప‌రిర‌క్షించి బంగారు భ‌విష్య‌త్తును అందించడంతో పాటు బాలకార్మిక వ్య‌వ‌స్థ నిర్మూల‌న‌లో ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని రాష్ట్ర ప్ర‌ణాళికా బోర్డు వైస్ ఛైర్మ‌న్, సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణువ‌ర్ధ‌న్ పిలుపునిచ్చారు.
బాల‌ల హ‌క్కుల వారోత్స‌వాల ముగింపు సంద‌ర్భంగా స్థానిక మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య భ‌వ‌న్‌లో చైల్డ్‌రైట్స్ అడ్వ‌క‌సీ ఫౌండేష‌న్ (సీఆర్ఏఎఫ్‌), జిల్లా మ‌హిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ముగింపు వేడుక‌ల‌కు ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మ‌న్ మ‌ల్లాది విష్ణు ముఖ్య అతిథిగా హాజ‌రై సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాలు సాధిద్దాం-బాల‌ల హ‌క్కులు ర‌క్షిద్దాం, ద‌త్త‌త ద్వారా త‌ల్లిదండ్రులు-బాల‌ల హ‌క్కు పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లుచేస్తున్న బాల‌ల హ‌క్కుల చ‌ట్టాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లుచేసిన‌ప్పుడే చిన్నారుల‌కు బంగారు భ‌విష్య‌త్తును అందించ‌గ‌లుగుతామ‌న్నారు. ముఖ్యంగా పేద‌రికంలో ఉన్న బాల‌ల జీవితాల్లో వెలుగులు నింపి వారు ఉన్న‌త స్థితికి చేరుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. బాల కార్మిక వ్య‌వ‌స్థను స‌మూలంగా నిర్మూలించ‌డంలో ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు స‌మ‌న్వ‌యంతో కృషిచేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. బాల్య‌వివాహాలపై ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతుల‌ను చేస్తున్న‌ప్ప‌టికీ ఇంకా అక్క‌డ‌క్క‌డ ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయ‌ని.. వీటిని పూర్తిస్థాయిలో అరిక‌ట్టాల్సిన అవ‌స‌రం మ‌హిళా శిశు సంక్షేమం, పోలీసు, రెవెన్యూ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌పై ఉంద‌న్నారు. బాల‌ల హ‌క్కులు, చ‌ట్టాల‌పై పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించేలా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని మ‌ల్లాది విష్ణు సూచించారు.
అడిష‌న‌ల్ డీసీపీ వెంక‌ట‌ర‌త్నం మాట్లాడుతూ చిన్న‌త‌నం నుంచే త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌పై ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టి క్ర‌మ‌శిక్ష‌ణ నేర్పితే భవిష్య‌త్తులో ఉన్న‌త పౌరులుగా ఎదుగుతార‌న్నారు. 6-14 ఏళ్ల పిల్ల‌ల‌కు క‌ల్పిస్తున్న ఉచిత నిర్బంద విద్య‌ను అమ‌లుచేయ‌డంలో లింగ వివ‌క్ష‌త‌ను రూపుమాప‌డంలో అధికారుల పాత్ర కీల‌క‌మ‌న్నారు. బాలల‌తో ప‌నిచేయించే య‌జ‌మానుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని.. పోక్సో, విద్య‌, బాల‌కార్మిక చ‌ట్టాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు.
ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ జి.ఉమాదేవి మాట్లాడుతూ జిల్లాలో బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌పై ప్ర‌త్యేకంగా దృష్టిపెట్‌రడంతో పాటు బాల‌ల సంర‌క్ష‌ణ‌పై ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. అంగ‌న్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల‌కు పూర్తిస్థాయిలో పౌష్టికాహారాన్ని అందించ‌డంతో పాటు కిశోర బాలిక‌ల్లో ర‌క్త హీన‌త‌ను నివారించే చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. బాల‌ల‌పై వేధింపులు, దోపిడీ, హింస వంటి సంఘ‌ట‌న‌ల‌ను గుర్తిస్తే పోలీసు, రెవెన్యూ, స్వ‌చ్ఛంద సంస్థ‌ల స‌హ‌కారంతో సంబంధిత వ్య‌క్తుల‌పై చ‌ర్య‌లు తీసుకొంటున్న‌ట్లు ఆమె తెలిపారు.
కార్య‌క్ర‌మంలో డిప్యూటీ మేయ‌ర్ అవుతు శైల‌జారెడ్డి, ఎస్సీపీసీఆర్ మెంబ‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్‌, దిశ ఏసీపీ వీవీ నాయ‌క్‌, సిద్దార్ధ క‌ళాశాల లెక్చ‌ర‌ర్ వ‌ర‌ల‌క్ష్మి, చేయూత స్వ‌చ్ఛంద సంస్థ సైకాల‌జిస్టు కృష్ణ‌కుమారి, చైల్డ్‌రైట్స్ అడ్వ‌క‌సీ ఫౌండేష‌న్ డైరెక్ట‌ర్ ఫ్రాన్సిస్‌, ఐసీడీఎస్ సీడీపీవోలు జి.మంగ‌మ్మ‌, కె.నాగ‌మ‌ణి, అంగ‌న్‌వాడీ సూప‌ర్‌వైజ‌ర్లు, కార్య‌క‌ర్త‌లు, ఏపీఎస్ఆర్ఎంసీ హైస్కూల్‌, సీవీఆర్ హైస్కూల్‌, వంగ‌వీటి మోహ‌న‌రంగా మెమోరియ‌ల్ బాలిక‌ల పాఠ‌శాల‌ల‌కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article