మహారాష్ట్ర : ‘వచ్చే ఎన్నికల్లో మీ తల్లిదండ్రులు నాకు ఓటు వేయకపోతే, రెండు రోజులు భోజనం చేయకండి’ అని 10 ఏళ్లలోపు పిల్లలతో మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ” ఎన్నికల ప్రచారంలో పిల్లల్ని వాడుకోకూడదు ” అని ఈసీ ఆదేశాలు జారీ చేసిన కొన్ని రోజులలోపే ఎమ్మెల్యే సంతోష్ బంగర్ పిల్లలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది అక్టోబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా తన నియోజకవర్గంలోని లఖ్ గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. పదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న సుమారు 50 మంది పిల్లలతో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తల్లిదండ్రులు తనకు (బంగర్) ఓటు వేయకపోతే రెండు రోజుల పాటు తినడం మానుకోవాలని వింత ప్రసంగం చేశారు.‘‘ ఎందుకు తినడం లేదని తల్లిదండ్రులు అడిగితే, ‘సంతోష్ బంగర్’ (నాకు)కు ఓటు వేయాలని చెప్పాలి. తరువాతే అన్నం తినాలి’’ అని బంగర్ పిల్లలను వేడుకుంటున్నాడు. ఈ మాటలు విని అతడి మద్దతుదారులు, చుట్టుపక్కల ఉన్న కొందరు స్కూల్ టీచర్లు తమ నవ్వును ఆపుకున్నారు. అయినా పిల్లలతో ‘సంతోష్ బంగర్’ అంటూ మూడు సార్లు బిగ్గరగా అనిపించారు.
ఈ వింత ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. బంగర్ పై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) నేతలు డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు బంగర్ కు ఓటు వేయకపోతే రెండు రోజులు తినవద్దని పిల్లలను అధికార ఎమ్మెల్యే రెచ్చగొట్టారని కాంగ్రెస్ ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ విమర్శించారు. రాజకీయ ప్రచారానికి గానీ, ఎన్నికలకు సంబంధించిన పనులకు గానీ పిల్లలను ఉపయోగించరాదని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశించినప్పటికీ ఎమ్మెల్యే బంగర్ ప్రచారం కోసం స్కూల్ కు వెళ్లాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.