సోమవారమే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్నానని చెప్పడమే కాక తన పదవికి రాజీనామా చేశారు.ఈ మేరకు కర్ణాటక రాజ్‌భవన్‌లో గవర్నర్ తవార్ చంద్ గెహ్లాట్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. కాగా, కుమారస్వామి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం అధికారంలోకి వచ్చిన యడ్యూరప్పను బీజేపీ అధిష్టానం తప్పించిన అనంతరం బొమ్మైకి సీఎం పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. యడ్యూరప్ప పదవిలో నుంచి దిగిపోయిన నేపథ్యంలో బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రిగా 19 నెలల 17 రోజుల పాటు విధులు నిర్వర్తించారు.అయితే రాజీనామా చేసేందుకు ముందుగానే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగానే రాబోయే రోజుల్లో పార్టీ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేస్తుందని బొమ్మై స్పష్టం చేశారు. అలాగే బీజేపీ ఓటమికి అనేక కారణాలున్నాయని, సీనియర్ నేతలతో కూర్చుని వాటిపై సమీక్షిస్తామని పేర్కొన్నారు. ఇంకా వచ్చే లోక్‌సభ ఎన్నికల సమయానికి పుంజుకుంటామని చెప్పారు. అలాగే కాంగ్రెస్ వ్యవస్థీకృత ఎన్నికల వ్యూహం ఫలించిందనీ, దాని విజయానికి ప్రధాన కారణాలలో అది కూడా ఒకటి అని ఆయన అన్నారు. ఇక ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయనీ, ప్రజల ఆదేశాన్ని తాను చాలా గౌరవంగా స్వీకరిస్తున్నానని సీఎం తెలిపారు. బీజేపీ ఓటమికి తాను బాధ్యత వహిస్తాననీ, మరెవరికీ బాధ్యత లేదనీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తానే పూర్తి బాధ్యత వహిస్తానని ఆయన స్పష్టీకరించారు.కాగా, ఈ ఎన్నికల్లో షిగ్గావ్ నియోజకవర్గం నుంచి బసవరాజ బొమ్మై వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. ఆయనకు 63,384 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ ఖాన్ పఠాన్‌కు 44,394 ఓట్లు వచ్చాయి. మరోవైపు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి లెక్కల ప్రకారం కాంగ్రెస్ 135 సీట్లను గెలుచుకుంది. ఇంకా మరో స్థానంలో ఆధిక్యం కొనసాగిస్తుంది. కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 సీట్లు కావాలి. ఇక ఇప్పటికే కాంగ్రెస్ ఖాతాలో కావలసినన్ని సీట్లు పడడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఎల్లుండే కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక సీఎం రేస్‌లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఉన్నారు. అయితే, ముందు వరుసలో మాత్రం సిద్ధరామయ్య పేరే వినిపిస్తోంది. ఈ మేరకు బెంగళూరులో ఆదివారం నాడు సీఎల్పీ సమావేశం జరగనుంది. గెలిచిన ఎమ్మెల్యేలందర్నీ బెంగళూరు రావాలని ఆదేశించింది కాంగ్రెస్ హైకమాండ్. సీఎల్పీ భేటీలోనే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. అయితే, కొత్త సీఎంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే. సీఎం ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు.