Thursday, November 28, 2024

Creating liberating content

Uncategorizedముద్దనూరులో టీడీపీ, వైసీపీ రచ్చరచ్చ

ముద్దనూరులో టీడీపీ, వైసీపీ రచ్చరచ్చ

  • పార్టీ ఫిరాయింపు తెచ్చిన తంటా..
  • వైసీపీలో సముచిత స్థానం ఇవ్వకపోవడంపై కొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న శశిధర్ రెడ్డి
  • జనవరి 19న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక
  • అనుచరులను టీడీపీలో చేర్చేందుకు తన ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసిన శశిధర్ రెడ్డి
  • వైసీపీలోకి తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో శశిధర్ రెడ్డి ఇంటి వద్ద నెలకొన్న ఘర్షణ వాతావరణం
  • కుర్చీలు, రాళ్లతోపరస్పర దాడులతో ఉద్రిక్తత
  • ఎమ్మెల్యే మూలే సుధీర్ రెడ్డి సమక్షంలో బెడిసి కొట్టిన బుజ్జగింపు యత్నాలు
  • శశిధర్ రెడ్డిని చెయ్యి పట్టుకుని ఇంటి నుంచి లాక్కుపోయిన ఎమ్మెల్యే !
  • రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు
  • టీడీపీ ఇన్చార్జి భూపేష్ రెడ్డి, అనుచరులను స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు
  • కొలిక్కిరాని రాజీయత్నాలు

ముద్దనూరు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తులు పార్టీలు ఫిరాయించడం మొదలైన నేపథ్యంలో కొన్నిచోట్ల బయటికి వెళ్లిన వారిని సొంతగూటికి తెచ్చుకునే ప్రయత్నంలో ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలోని ముద్దనూరులోనూ బుధవారం ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. వైకాపాలో కొనసాగుతున్న స్థానిక నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమీప బంధువు శశిధర్ రెడ్డి జనవరి 19న కమలాపురంలో జరిగిన “రా.. కదలిరా..” కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి భూపేష్ రెడ్డి తో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ తరుణంలో.. తన అనుచరులను టీడీపీలో చేర్పించేందుకు శశిధర్ రెడ్డి ముద్దనూరులోని తన నివాసంలో భూపేష్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సమాచారం తెలుసుకున్న వైసీపీ నేతలు, ఆ సమయములో ముద్దనూరులోనే ఉన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో.. శశిధర్ రెడ్డిని బుజ్జిగించేందుకు తమ పార్టీ నాయకులు ముని రాజారెడ్డి, మరికొందరిని ఎమ్మెల్యే పంపించారు. దీంతో వారు శశిధర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను తిరిగి వైకాపాలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితిలో టీడీపీ ఇన్చార్జి భూపేష్ రెడ్డితో పాటు అక్కడే ఉన్న టీడీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు వైకాపా నాయకుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల వారూ పరస్పరం వాగ్వాదాలు చేసుకున్నారు. దీంతో టీడీపీ, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అప్పటికే ముద్దనూరులోనే పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన వైకాపా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా శశిధర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. శశిధర్ రెడ్డితో మాట్లాడి పార్టీలోకి తిరిగి ఆహ్వానించేందుకు ఎమ్మెల్యేతో పాటు నాయకులు మాటలు కలిపారు. వీరి ప్రయత్నాన్ని అడ్డుకున్న టీడీపీ వారు తీవ్రంగా వ్యతిరేకించారు. తమ అనుచరులను టిడిపిలో చేరుస్తామని శశిధర్ రెడ్డి చెప్పినందువల్లే తాము వచ్చామని భూపేష్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు చెబుతుండగా, తమ రక్తసంబంధీకుడైన శశిధర్ రెడ్డితో మాట్లాడడానికి మాత్రమే తాము వచ్చామని, తమ బంధువుతో తాము మాట్లాడడం తప్పా అని ఎమ్మెల్యే, ఆయన బంధువులు వాదోపవాదాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు ఆగ్రహ వేషాలకు లోనయ్యారు. ఫలితంగా రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడం, కుర్చీలు విసిరేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. టిడిపి కార్యకర్తలు శశిధర్ రెడ్డి ఇంట్లో నుంచి కుర్చీలను ఇంటి బయట ఉన్న వైకాపా వారిపై విసరగా, బయట నుంచి వైకాపా కార్యకర్తలు ఇంట్లోకి రాళ్లు విసిరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది అన్న స్థానిక పోలీసుల సమాచారంతో.. స్థానిక పోలీసులతో పాటు సిఐ, డీఎస్పీ, స్పెషల్ పార్టీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు వర్గాలను చెదరగొట్టి శాంతింప చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భూపేష్ రెడ్డి తన మిత్రులతో
రోడ్డుపై బైఠాయించారు. తన
అనుచరులను పార్టీలో చేరుస్తామంటేనే వచ్చామని,
ఎమ్మెల్యే తాటాకు చప్పుళ్లకు తాము భయపడేది లేదని భూపేష్ రెడ్డి హెచ్చరించారు.
మరోవైపు ఉద్రిక్తత కొనసాగుతుండగానే, మాట్లాడుకుందాం రా అంటూ
శశిధర్ రెడ్డిని ఇంటి నుంచి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి లాక్కుపోయాడు. దీంతో అక్కడ పరిస్థితి రచ్చ రచ్చగా మారింది. అనంతరం
భూపేష్ రెడ్డిని పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు.
టీడీపీ నేతలపై ఎమ్మెల్యే పరుష పదజాలంతో దూషించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని భూపేష్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. తమ బంధువుతో మాట్లాడాలనుకుంటే ఇంతకుముందే ఎందుకు మాట్లాడలేదని, తాము వచ్చినప్పుడు చర్చల పేరుతో ఎందుకు రావాలని టిడిపి నేతలు ప్రశ్నించారు. అయితే ఎమ్మెల్యే కూడా యాదృచ్ఛికంగా ముద్దనూరులోనే ఉండడం, శశిధర్ రెడ్డి కూడా టిడిపి నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఈ యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ శాంతి భద్రతల సమస్య తలెత్తిందని పలువురు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ కోసం కట్టుదిట్టమైన బందోబస్తులు ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article