మీరేమైనా నాకనవసరం
నా కాపురం టీడీపీతోనే…
జనసేన-టీడీపీ పొత్తు ఎవరికి లాభం..?
రాజేశ్వరరావు కొండా//సీనియర్ జర్నలిస్టు//
మీరంతా ఏమైపోయినా నాకు అనవసరం. నేను మాత్రం టీడీతోనే కాపురం చేస్తాను. అందుకు ఇష్టమైన వాళ్లే నన్ను అనుసరించండి. అది నచ్చని వాళ్లు వెళ్లిపోయినా నాకొచ్చే ఇబ్బంది ఏమీలేదు. నా సిద్దాంతాలు నాకున్నాయి. నాకంటూ ఒక నిర్ధిష్టమైన ప్రణాళిక ఉంది. వచ్చే ఎన్నికలలో నా అభిప్రాయంతో ఏకీభవించే వారే మాతో ప్రయాణించండి. కాదనుకునే వారు వైసీపీలోకి వెళ్లిపోయినా పర్వాలేదు. టీడీపీతో నాకుండే పొత్తును విరమించుకోవాలని నాకెవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ సారి జగన్ ను ఓడించడమే నాఅంతిమ లక్ష్యం. అందుకే నేను ఏపీలో టీడీపీతో పొత్తుకు సిద్దమయ్యాను. నేను సీఎం అవడం నాముందున్న సవాలు కాదు. కేవలం జగన్ రెడ్డిని ఇంటికి పంపించడమే నాకున్న ఏకైక గోల్. ఇవే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారం రోజుల క్రితం మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మాటలు. ఆయన అలా మాట్లాడుతుంటే అందరూ నిశ్చేష్టులై కేవలం శ్రోతలగానే మిగిలిపోయారు. తనకంటూ ఒక సొంత పార్టీ పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులను తయారు చేసుకున్నారు. పవన్ అంటే ప్రాణం ఇచ్చే సైనికులు ఆయన సొంతం చేసుకోగలిగారు. పవన్ అంటే వారందరికీ అదో పిచ్చి అభిమానం. వారు ఎంతకైనా తెగిస్తారు. అది కేవలం ఆయన హీరోయిజం మీద ఉన్న అభిమానమే తప్ప రాజకీయంగా మాత్రం కాదనేది ఇటీవల వైజాగ్ లో జరిగిన భారీ బహిరంగ సభ స్పష్టం చేసింది. వైజాగ్ సభ ముందు వరకూ ఆయన ఎక్కడ సమావేశాలు నిర్వహించినా అయా చుట్టుపక్కల ప్రాంతాలనుంచి భారీగా అభిమానులు తరలిరావడం ఆయనకు ఒక ప్లస్ పాయింట్ అయ్యింది. అయితే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు అయి రాజమండ్రి జైలుకు రిమాండ్ పై తరలించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును కలిసి బయటకు వచ్చిన వెంటనే ఆయన మాట్లాడిన మాటలు జనసైనికుల మనసును తీవ్రంగా గాయపర్చాయి. ఒక పార్టీ అధినేతగా ఉంటూ ఆ పార్టీలోని ముఖ్యులను ఎవరినీ సంప్రదించకుండానే తనకు తానే టీడీపీకి ఇకపై అండగా ఉంటానని అందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్దమేనని నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ నడుమ పవన్ కళ్యాణ్ మీడియా సాక్షిగా ప్రకటన చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైంది. ఒక్కసారిగా టీడీపీ శ్రేణులుకూడా ఒకింత ఆశ్చర్యానికి కూడా గురయ్యారు. ఎవరైనా పార్టీ విధి విధానాల ప్రకారమే నడుచుకోవాలి. అదే నిర్ణయాన్ని పార్టీ అంతర్గత సమావేశం ద్వారా అందరి అభిప్రాయంగా చెప్పవచ్చు. కానీ అలాంటి సమావేశం ఏదీ నిర్వహించకుండా ఓ నియంతలా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆయన ఉనికికే దెబ్బ తగిలింది. వారాహిపై కూడా ఆయన చేసినదంతా సోలోషోనే తప్ప పార్టీ వ్యక్తులకు ఆవాహనంపై స్థానం కల్పించక పోవడం కూడా కార్యకర్తల మనోభావాలు చాలా వరకూ దెబ్బతిన్నాయి. అయినా ఆయన అవేమీ పట్టించుకోకుండా తనదైన శైలిలోనే ముందుకు వెళ్తున్నారు. అదే ధీమాతో తెలంగాణాలో జరిగిన ఎన్నికలలో బీజేపీతో పొత్తుపెట్టుకుని తన వీర ప్రతాపం చూపించాలని ఎంతో ఆశపడ్డారు. తెలంగాణా ఎన్నికలలో ఆయన నిలబెట్టిన ఏ ఒక్క అభ్యర్థికీ కనీసం డిపాజిట్లు కూడా రాకపోవడంతో చతికిల పడ్డారు. అటు బీజేపీ అధిష్టానాన్ని కూడా నిరాశకు గురిచేసింది. ఇక ఇప్పుడు నా ప్రతాపం అంతా ఆంధ్రాలోనే అంటున్న పవన్ కళ్యాణ్ ఏమేరకు దుందిబి మోగించనున్నారో అవగతం అవుతోంది. అయితే ఆయనకున్న ధీమా మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. గతంలో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఎక్కడా గెలవకపోవడం రాజోలులో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను సైతం వదిలేసుకోవడం ఆ సామాజిక వర్గంలో కొంత మైనస్ గానే చెప్పవచ్చు. ఇక తన సొంత సామాజిక వర్గంమంతా తనకే సహకరిస్తుందని ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తున్న ఆయన ఇటీవల ఆయన సొంత పార్టీ కార్యాలయంలోని సిబ్బంది ఒక్క వేటుతో తొలగించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ మాటలకు చేతలకు ఎక్కడా పొంతన కుదరడంలేదు. ఇప్పుడు చాలామంది జనసైనికులు బహిరంగంగా అంటున్న మాటలు వింటుంటే ప్రతిపక్షాలకు సైతం ఒళ్లు గగుర్పాటుకు గురి కావాల్సి వస్తుంది. తాము ఆయనకు వీరాభిమానులమే కానీ ఆయనకు మాత్రం ఓటు వెయ్యం. మా ఓటు జగన్ కే వేస్తాం. అనడం ఒకింత గందరగోళంగానే ఉంది. ఆయన పార్టీని నడిపిస్తూ ఆయన సీఎం అవుతానంటే తాము సహకరిస్తాం కానీ నాఇంట్లో అన్నం తిని పక్కవాడి ఇంట్లో చేయికడగమంటే ఎలా కడుగుతాం అని ఎద్దేవా చేస్తున్నారు. ఇకనైనా పవన్ కళ్యాణ్ తన బాణీ మార్చుకోక పోతే ఆయనే నష్టపోతాడు తప్ప మాకేమీ నష్టం ఉండదని తెగేసి చెబుతున్నారు. ఏదేమైనా ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈ సారి ఎన్నికలు ప్రధాన పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. సీఎం జగన్ వై నాట్ 175 నినాదంతో అధికారం ఖాయమనే ధీమాతో ఉన్నారు. జగన్ ను ఓడించటమే లక్ష్యంగా పవన్ – చంద్రబాబు జత కట్టారు. బీజేపీ తమతో కలిసి రావాలని ఈ ఇద్దరు కోరుకుంటున్నా ఆ పార్టీ నుంచి ఇప్పటికీ సానుకూల స్పందన లేకపోవడం ఒక విచిత్రంగా మారింది. ఇదే సమయంలో క్షేత్ర స్థాయిలో మాత్రం ఈ రెండు పార్టీల పొత్తు ముఖచిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ముందస్తుగానే షెడ్యూల్ కారణంగానే జనసేన క్యాడర్ టీడీపీతో పొత్తు కోసం మనస్పూర్తిగా పని చేయటం లేదు. తెలంగాణలో ఫలితాల తరువాత జనసేనకు సీట్లు డిమాండ్ విషయంలో వాడి వేడి తగ్గింది. తొలుత 50 సీట్ల వరకు జనసేనకు పొత్తులో దక్కుతాయనే చర్చ సాగింది. కానీ, ఇప్పుడు జనసేనకు 20 సీట్ల వరకు పరిమితం చేయటానికి రంగం సిద్దమైందని తెలుస్తోంది. పవన్ సైతం ఇప్పటికే ప్రజల్లో పార్టీలో టీడీపీతో పొత్తు చంద్రబాబు సీఎంగా కమిట్ అవ్వటంతో ఎన్ని సీట్లు ఇచ్చినా సర్దుకుపోయే ధోరణితోనే ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఇది జనసేన శ్రేణులకు రుచించటం లేదు. పవన్ సీఎం కావాలని తాము కోరుకుంటుంటే చంద్రబాబు కోసం పని చేయటం ఏంటనేది క్షేత్ర స్థాయిలో చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. లోకేశ్ యువగళం యాత్ర ఈ నెల 20న ముగియనుంది. యువగళం ముగింపు సభకు చంద్రబాబు – పవన్ హాజరు కానున్నారు. ఇద్దరు నేతలు కలిసి జిల్లాల్లో సభల్లో పాల్గొనాలని భావిస్తున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో పైనా ఇంకా స్పష్టతే రాలేదు. అటు జగన్ అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. ఇటు రెండు పార్టీల్లోనూ సీట్ల పైనే క్లారిటీ లేదు. టీడీపీ ప్రకటించిన సంక్షేమ మేనిఫెస్టో కు ఆదరణ దక్కలేదు. అటు జగన్ తన సంక్షేమమే తనను గెలిపిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇంకా క్షేత్ర స్థాయిలో కేడర్ మధ్య అవగాహన కుదరలేదు. రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశాలు నిలిచి పోయాయి. ఏప్రిల్ లోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని భావిస్తున్న వేళ ఈ రెండు పార్టీల పొత్తు తో ఎలాంటి ఫలితం వస్తుందనేది ఇంకా అస్పష్టంగానే కనిపిస్తోంది.