పోరుమామిళ్ల:
విద్యార్థులు పుస్తక పఠనం అలవరచుకుంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదాపీర్, జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యవర్గ సభ్యులు ఖాసీం వల్లి తెలిపారు. ఆదివారం కాశినాయన మండలంలోని రెడ్డి కొట్టాల ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉయ్ లవ్ రీడింగ్ కార్యక్రమం నిర్వహించారు. హరిత ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఫణి రాజకుమార్ రెడ్డి కొట్టాల ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన గ్రంథాలయంలోని పుస్తకాలను విద్యార్థులు ఉత్సాహంగా చదివారు. ఈ కార్యక్రమాన్ని జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యవర్గ సభ్యులు ఖాసీం వల్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఖాసీం వల్లి విద్యార్థులతో మాట్లాడుతూ ఉయ్ లవ్ రీడింగ్ కార్యక్రమంలో భాగంగా కథలు, పాటలు తదితర పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తానన్నారు. పుస్తక పఠనంతో సంభాషణ చాతుర్యం పెరుగుతుందన్నారు. పుస్తక పఠనంతో భవిష్యత్తులో విద్యార్థులు ట్రబుల్ షూటర్స్ గా తయారవుతారన్నారు. హరిత ఫౌండేషన్ ఏర్పాటు చేసిన గ్రంథాలయంలోని ప్రతి పుస్తకాన్ని విద్యార్థులు చదవాలన్నారు. పాఠశాలలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన హరిత ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఫణి రాజకుమార్ కు రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదా పీర్, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.