ప్రజాభూమి ప్రతినిధి,వేములవాడః
రాష్ట్రంలోని ప్రముఖ శైవాలయ వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. వెంటనే ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అద్దాల మండపంలో ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కొత్త సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి కల్యాణ ఒప్పందంపై సంతకం చేశానన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తొలుత యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నామన్నారు. నేడు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మండుటెండలో చెరువులు సైతం నిండుకుండలా మారాయన్నారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 56 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. పేదల ఆరాధ్య దైవమైన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. ఇప్పటికే దాదాపు రూ. 100 కోట్లు వెచ్చించి భూసేకరణ, ఇతర అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు పాలకవర్గాలను నియమించామన్నారు. మరో ఐదు ఆలయాల అభివృద్ధి, పునరుద్ధరణ పనుల్లో పాలకమండలి పాలుపంచుకోదని, ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.