ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును వైఎస్ షర్మిల, ఆ పార్టీ సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు తదితర నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో షర్మిల మాట్లాడుతూ …రూ. 750 కోట్లు పెట్టి వైఎస్సార్ గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే… ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కోసం ఏడాదికి కనీసం కోటి రూపాయలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకు పోతుంటే సంబంధిత శాఖ మంత్రి మాత్రం సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదు సంవత్సరాల నుంచి సరిగా మెయింటెనెన్స్ చేసి ఉంటే గేట్లు కొట్టుకుపోయేవి కావు. లక్ష ఎకరాలకు సాగునీరు, 12 మండలాలకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ గుండ్లకమ్మ..16 నెలల క్రితం ఒక గేటు, మూడు నెలల క్రితం మరో గేటు కొట్టుకుపోయాయి.. మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే గేట్లు కొట్టుకుపోతున్నాయని వైఎస్ షర్మిల అన్నారు.
గేట్లు కొట్టుకుపోవడం వల్ల రెండు టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఖాళీ కావడంతో… నీళ్లు లేక ఆయకట్టు రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.. రాజశేఖరరెడ్డి ఆశయాలను నిలబెడుతున్నానని జగనన్న అంటున్నారు… ఇదేనా ఆశయాలను నిలబెట్టడం? అని విమర్శించారు.
గుండ్లకమ్మ ప్రాజెక్టును జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ నిర్మించారు.. ఆ ప్రాజెక్టుకు కనీసం మెయింటెనెన్స్ కూడా చేయని మీరు వైఎస్ వారసుడు ఎలా అవుతారని జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.