Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలువైఎస్ షర్మిల అరెస్ట్: హైదరాబాద్‌లో ఉద్రిక్తత

వైఎస్ షర్మిల అరెస్ట్: హైదరాబాద్‌లో ఉద్రిక్తత

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు.

జూబ్లీహిల్స్ లోటస్‌పాండ్ వద్ద గల నివాసం వద్ద పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే వైఎస్ఆర్టీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్‌కు చేరుకున్నారు. దీనితో లోటస్ పాండ్, జూబ్లీ‌హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన ఆమెను లోటస్ పాండ్ నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను కారు ఎక్కనివ్వలేదు. దీనితో రోడ్డు మీదే నడుచుకుంటూ ప్రగతి భవన్ వైపు బయలుదేరారు. ఆ సమయంలో పోలీసులు చుట్టుముట్టారు. ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన షర్మిల ఓ మహిళా కానిస్టేబుల్ చెంప పగులగొట్టారు.షర్మిలను ఇంటికి పంపించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ కొలిక్కి రాకపోవడంతో ఆమెను అరెస్ట్ చేశారు. తమ వాహనంలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై వైఎస్ షర్మిల పోరాటాన్ని సాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు కోసం ఆమె డిమాండ్ చేస్తోన్నారు.ఈ కేసుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఏ మాత్రం ఆశించిన స్థాయిలో పని చేయట్లేదని ఆరోపిస్తోన్నారు. సిట్ చేస్తోన్న దర్యాప్తు కొండను తవ్వి ఎలుకను పడుతున్నట్లుందంటూ విమర్శిస్తోన్నారు. ఇప్పటివరకు సిట్ అధికారులు 19 మందిని అరెస్ట్ చేశామని చెప్పుకొంటోందని, పాత్రధారులను మాత్రమే దోషులుగా చూపెడుతూ అసలైన సూత్రధారులకు క్లీన్ చిట్ ఇచ్చే పనిలో పడిందంటూ షర్మిలధ్వజమెత్తారు.టీఎస్‌పీఎస్స‌ీ ప్రశ్నా పత్రాల లీక్ తతంగంపై సిట్ పూర్తిస్థాయిలో విచారించట్లేదని, ప్రగతి భవన్ డైరెక్షన్‌లోనే ఈ దర్యాప్తు సాగుతోందంటూ ఆరోపించారు. తెరవెనుక ఉన్న అసలు దొంగలను సిట్ ప్రశ్నించట్లేదని మండిపడ్డారు. ప్రశ్నాపత్రాల లీక్ అంశం దేశాలు దాటిపోయిందని అయినా, కేసీఆర్ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపు లేదని వైఎస్ షర్మిల చెప్పారు.

టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యుల్లో ఇప్పటివరకు ఏ ఒక్కరినీ అదుపులోకి తీసుకోలేదని గుర్తు చేశారు. కనీసం కాన్ఫిడెన్షియల్ అధికారిని కూడా బాధ్యతల నుంచి తప్పించలేదని అన్నారు. దర్యాప్తు ముగిసే వరకు బోర్డ్ సభ్యులపై నిఘా పెట్టడంలో కూడా సిట్ అధికారులు విఫలం అయ్యారని చెప్పారు. పేపర్ లీకుల్లో ఉద్యోగులు మాత్రమే ఉంటే సీబీఐ దర్యాప్తునకు కేసీఆర్ అండ్ బ్యాచ్ ఎందుకు భయపడుతోందంటూ వైఎస్ షర్మిల నిలదీశారు.సీబీఐ పేరు చెప్తేనే కేసీఆర్‌కు వణుకు పుడుతోందని, దీన్ని బట్టి చూస్తే- అసలు దొంగలు ప్రగతి భవన్‌లోనే ఉన్నారనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే పేపర్ లీకులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని, ప్రస్తుత టీఎస్‌పీఎస్సీ బోర్డును తక్షణం రద్దు చేసి కొత్త దాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article