బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యంతో కాంగ్రెస్ దూసుకుపోతోంది. అన్ని కలిసొస్తే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అవకాశం ఉన్న డీకే శివకుమార్ కనకపురా నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయనకు కళ్లెం వేసేందుకు భాజపా ఒక్కలిగ సముదాయానికి చెందిన ఆర్.అశోక్‌ను బరిలోకి దింపినా ప్రయోజనం లేకపోయింది. డీకే ధాటికి అశోక్ నిలవలేకపోయారు.
ప్రగతి పథమే డీకే గెలుపు రథమై..
కనకపురాలో శివకుమార్‌కు పోటీగా నామినేషన్ వేయాలన్నా ప్రత్యర్థులు రెండు మూడు సార్లు ఆలోచించాల్సిందే. 2008 వరకు కనకపురా అంటే జేడీఎస్‌కు కంచుకోట. ఇలాంటి ప్రాంతంలో కాంగ్రెస్ బలపడిందంటే అందుకు ప్రధాన కారణం డీకే కుటుంబమే. పంచాయతీ భవనాలు, విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ల వసతులతో ఈ ప్రాంతాన్ని డీకే సోదరులు వృద్ధి చేశారు. అయితే శివకుమార్‌ను ఎలాగైనా అడ్డుకోవాలని చూసిన భాజపా అశోక్‌ను బరిలోకి దింపినా ఫలితం దక్కలేదు