డిస్టిక్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పైడిపల్లి కిషోర్
పులివెందుల, తొండూరు
ఏపీ ఈసీసీ చీఫ్ షర్మిల ముఖ్యమంత్రి జగన్ అన్న అని కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలేల అని డిస్టిక్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పైడిపల్లి కిషోర్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి షర్మిల ముఖ్యమంత్రిని టార్గెట్ చేసినట్లుగా ఉంది అన్నారు. ప్రతిరోజు ముఖ్యమంత్రిపై పలు ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. కుటుంబం అన్నాక తగాదాలు, గొడవలు ఉండటం సహజమే అన్నారు.వాటికి పరిష్కార మార్గం కూడా ఉంటుం దన్నారు. తన తండ్రి రక్తం తనలో ప్రవహిస్తుందన్న షర్మిల మాటలకు అర్థమే లేదన్నారు. తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సుమారు మూడు దశాబ్దా ల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేశారన్నారు. ఆయన దీర్ఘకాలిక ఉద్యమాలు, సరైన ఆలోచనలు వివిధ వాటిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ రెండు పర్యాయాలు వైయస్ రాజశేఖర్ రెడ్డిని
ముఖ్యమంత్రిని చేసిందన్నారు. ఒకవేళ రాజ్యసభ సీటు కావాలని ఆకాంక్ష షర్మిలలో ఉన్నట్లయితే అది వైసీపీ నుంచి పొందే అవకాశం ఉందన్నారు. ఇంత మాత్రానికి జగన్ పై అసంబద్ధ ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. దీనివల్ల వైయస్ కుటుంబం పరువు పోతుంది గాని షర్మిలకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు.వైయస్సార్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ వైయస్ కుటుంబ సభ్యులను పట్టించుకోకపోవడంమేకాకుండా పక్కన పెట్టిందన్నారు. దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగి వైయస్సార్సీపి కొత్త పార్టీ స్థాపించారన్నారు. జగన్ 16 నెలల పాటు జైలు పాలు కావడానికి కాంగ్రెస్ ప్రధాన కారణమని ప్రజలు భావిస్తున్నారన్నారు. తండ్రిని పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్న జగన్ ఆదుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుందన్నారు. ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలమ్మ చేరిపోవడం ప్రజలకు ఎవరికీ ఇష్టం లేదన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ నాలుగున్నవేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారని తెలిపారు. ఇప్పటికైనా షర్మిలమ్మ మనసు మార్చు కుని ముఖ్యమంత్రి జగన్ పై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన కోరారు.