-మహిళా సమైఖ్య జిల్లా అధ్యక్షురాలు ఎం విజయమ్మ
కనిగిరి:సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు రాష్ట్ర మహిళలందరూ సిద్ధంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైఖ్య జిల్లా అధ్యక్షురాలు ఎం. విజయమ్మ హెచ్చరించారు. గత ఎన్నికల ముందు దశలవారీగా మద్య నియంత్రణ చేస్తానని హామీని అమలు చేయకుండా మహిళలు నమ్మించి మోసం చేసిన ముఖ్యమంత్రికి సార్వత్రిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామన్నారు. రాష్ట్రంలో మహిళలపై అనేక రకమైన దాడులు జరుగుతున్న వైసిపి ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. శనివారం కనిగిరి దర్శి చెంచయ్య భవన్లో ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమైక్య కనిగిరి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మహిళల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అనంతలక్ష్మి, గౌరవ అధ్యక్షుడు ఎస్. రావమ్మ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు వైయస్ జగన్ మధ్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వానికి ప్రధాన వనరుగా మార్చుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు 70 వేలకు పైగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి రాజకీయ పార్టీ మధ్య నిషేధం చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చాలని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయాలని లేకపోతే మహిళా సమైఖ్య ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. మధ్య నిషేధం పై మాట తప్పిన సీఎం జగన్ ఎన్నికలవేళ ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారా అని ఎద్దేవా చేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ యాసిన్ మాట్లాడుతూ మహిళలు సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజాభివృద్ధి చెందుతుందని మహిళలు అన్ని రంగాల్లో సమస్యలపై రాజీ పడకుండా పోరాడుతూ విజయం సాధించాలన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అనేక దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్న నిమ్మకునీరేత్తకుండా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలు, గ్యాస్, పెట్రోల్ పెరిగి పేద మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికి పోతున్నారని మహిళలు సమస్యలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం కనిగిరి పట్టణ మహిళా సమైక్య నూతన కమిటీని ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సమైఖ్య నాయకురాలు జిపి గాయత్రి, ఆ అంజమ్మ, ఏం సులోచన సిపిఐ మండల కార్యదర్శి జిపి రామారావు, ఏఐటియుసి కనిగిరి నియోజకవర్గం అధ్యక్షుడు గుజ్జుల బాలిరెడ్డి, ఖాసీంవళి, చెన్నయ్య ఇతర మహిళా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.