Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుస్కిల్‌ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్‌ మంజూరు

స్కిల్‌ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్‌ మంజూరు

ప్రజాభూమి, విజయవాడ బ్యూరో:
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేస్తూ జస్టిస్‌ టి.మల్లికార్జున్‌రావు సోమవారం తీర్పు వెల్లడించారు. ఈ నెల 28న రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని ఆదేశించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు గురువారం (ఈనెల 17న) ముగియడంతో తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వు చేసింది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. తాజాగా సోమవారం బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది.

వాదనలు కొనసాగాయిలా..
రాజకీయ పెద్దలు చెప్పినట్లు ఏపీ సీఐడీ నడుచుకుంటోందని చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు గురువారం వాదనలు వినిపించారు. పోలీసులు చట్టానికి విధేయులై ఉండాలి తప్ప రాజకీయ నేతలకు కాదని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ దురుద్దేశపూర్వకంగా, రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశాయని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. వాస్తవాలను దాచిపెట్టి అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వృత్తి విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున బార్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు గానీ, తాము ఆ పని చేయట్లేదని తెలిపారు.

సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు వాదనలు వినిపిస్తూ..

‘లొంగిపోయేటప్పుడు రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌కు సీల్డ్‌కవర్లో వైద్యనివేదికలు అందజేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్‌ ఉల్లంఘించారు. ఆ నివేదికలు నమ్మశక్యంగా లేవు. బెయిల్‌ మంజూరుకు వాటిని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు. ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించాలి. మధ్యంతర బెయిల్‌ పొందిన చంద్రబాబు.. హైదరాబాద్‌ వెళ్లి ర్యాలీ నిర్వహించి, కోర్టు షరతులను ఉల్లంఘించారు. బేగంపేట పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారు. ఈ కేసులో ఇతర నిందితులకు బెయిల్‌ మంజూరయిందన్న కారణంతో పిటిషనర్‌కు బెయిల్‌ ఇవ్వాలని న్యాయవాదులు కోరడం సరికాదు. అందువల్ల బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేయాలి’ అని కోరారు. ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు తాజాగా సోమవారం మధ్యాహ్నం బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article